_______________________________________
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- సమాజం పట్ల బాధ్యత కలిగి మీ ప్రత్యేక జీవన శైలిని మార్చు కోవాలని అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి బాబు బృహన్నలకు సూచించారు. జాతీయ రహదార్లపై వ్యభిచరించడం నిషేధం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డం, వివాహాలు ఇతర శుభకార్యాల్లో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డం నేరం. ఈ విధమైన నేరాలకు, అనైతిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా చట్టబద్దమైన శిక్షలు అమలులో ఉన్నాయి. అందుకే మీరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సాధారణ జనజీవన స్రవంతి మాదిరిగానే మీ జీవనాన్ని కొనసాగించండని బృహన్నలకు ఎస్సై జి.శ్రీహరిబాబు హితోపదేశం చేసారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో సంచరిస్తూ వారిదైన దైనందిన ప్రత్యేక జీవన శైలిలో జీవిస్తోన్న బృహన్నలు అందరినీ అన్నవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ప్రత్యేకంగా సమావేశ పరిచి వారికి ఎస్సై శ్రీహరిబాబు మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుత సమాజంలో మీరొక ప్రత్యేక తరగతి / వర్గంగా కాకుండా అందరి పౌరులు మాదిరిగానే మీరు కూడా సగౌరవంగా జీవించాలని, అందుకు ప్రత్యామ్నాయ ఉద్యోగ, జీవనోపాధి అవకాశాలను అందిపుచ్చు కోవాలని, అందుకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని ఎస్సై హితవు పలికారు. దారి దోపిడీలు, దొంగతనాలు, వ్యభిచారం నేరాల్లో బృహన్నలు కూడా పాల్గొన్న కొన్ని ఘటనలు గతంలో అనేకం ఉన్నాయని, అటువంటి సంఘటనలు ఇకపై జరిగితే అందుకు బాధ్యులైన వారిపై చట్టం విధిగా కఠినమైన చర్యలను తీసుకుంటుందని ఎస్ఐ. హెచ్చరించారు. అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని బృహన్నల గణన, సామాజిక పరిస్థితులపై ఇప్పటికే పలు వివరాలను పోలీసు శాఖ సేకరించిందని, వారి కదలికలపై నిఘా ఉంచిందని ముందస్తుగా ఎస్ఐ. జి.శ్రీహరిబాబు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు సంఘ వ్యతిరేక శక్తులు, అనైతిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి దృష్టి సారించాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు తాము ఈ సమావేశాన్ని నిర్వహించాం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్తిపాడు సిఐ సూర్య అప్పారావు పర్యవేక్షించారు.