వైద్య విద్యార్థులు కేవలం కంఠస్థం చేయకుండా విషయ పరిజ్ఞానాన్ని, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

విద్యార్థులకు ఆరు సంవత్సరాల వైద్య విద్య ఒక అద్భుతమైన ప్రయాణం

– జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్,

రేణిగుంట / తిరుపతి, నవంబర్ 12: వైద్య వృత్తి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవప్రదమైన వృత్తి అని, వైద్య విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి రోగి సంక్షేమాన్ని, వైద్య నైతిక విలువలను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

గురువారం ఉదయం రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలో వున్న బాలాజీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం, వైట్ కోట్ సెరిమనీ, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య విద్యార్థులుగా తమపై ఉన్న బాధ్యతను గుర్తించి, వైద్య వృత్తిని ఒక గొప్ప సవాల్‌గా స్వీకరించాలని సూచించారు. ఏ చికిత్స అందించినా, రోగ నిర్ధారణ చేసినా రోగి పట్ల శ్రద్ధ, బాధ్యత, మానవతా దృక్పథం కలిగి ఉండాలన్నారు. వైద్య రంగంలో వైద్య నైతికతకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గత రెండు మూడు దశాబ్దాల్లో వైద్య నైతిక ప్రమాణాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎక్కడ పనిచేసినా ఆర్థిక, భౌతిక ప్రయోజనాల కంటే వృత్తిపరమైన ప్రమాణాలు, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్నారు.
తాను గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖలో, ఎండీ ఎన్‌హెచ్ఎం కమిషనర్‌గా పనిచేసిన అనుభవంతో వైద్య రంగంలో ఎదురయ్యే అనేక పరిస్థితులను పరిశీలించానని, అందువల్ల వైద్య విద్యార్థులు ప్రారంభం నుంచే నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు.
రాబోయే ఆరు సంవత్సరాలు విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైనవని, ఈ సమయాన్ని చదువుతో పాటు మంచి స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వైద్య విద్యలో సహచరులతో కలిసి ఆరు సంవత్సరాలు గడిపే అరుదైన అవకాశం లభిస్తుందని, ఈ ప్రయాణాన్ని ఆనందంగా ఆస్వాదించాలన్నారు. వైద్య విద్యార్థులు చదువులో అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, కేవలం పాఠ్యాంశాలను కంఠస్థం చేయడానికే పరిమితం కాకుండా వాటిలోని ప్రాథమిక సూత్రాలు, అంతర్లీన విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఆచరణాత్మకంగా నేర్చుకోవాలని సూచించారు. ఫార్మకాలజీ వంటి కొన్ని వైద్య శాస్త్ర అంశాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నప్పటికీ, వాటి సారాంశాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వైద్య సేవలు అందించడం మరింత సులభమవుతుందని వివరించారు.
విద్యార్థులు తమ వృత్తిని ప్రేమించాలని, మంచి స్నేహాలను ఏర్పరచుకోవాలని, గురువులను గౌరవించాలని, ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగుతూ సమాజానికి ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. 2026-27 బ్యాచ్ విద్యార్థులందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు, తిరువనంతపురం ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్ సురేష్ శివానందన్, ఐఆర్ఎస్, పరాలాఖేముండి ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పాణిగ్రాహి, బాలాజీ మెడికల్ కాలేజ్ సీఈఓ డా. తిరుపతి పాణిగ్రాహి, సాయిరామ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీసాయి ప్రకాష్ లీలాముత్తు, సురేష్ కుమార్ పాణిగ్రాహి, డా. రాకేష్ కుమార్ పాణిగ్రాహి, భిలాయ్ సూరజ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎం. రాజశేఖర్, భువనేశ్వర్ హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డా. దేవానంద మహాపాత్ర, కళాశాల యాజమాన్య ప్రతినిధులు, విభాగాధిపతులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *