కలిగిరి, అక్టోబర్ 25, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు కె

మీ త్యాగాలను మరవబోము, మీ దారిని విడవబోము అంటూ కలిగిరి పోలీసులు ప్రతిజ్ఞ చేశారు.పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి కలిగిరి పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ముందుగా కలిగిరి తహసిల్దార్ ఆఫీస్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన పురవీధుల మీదుగా సాగింది. పోలీసులు చేతిలో కొవ్వొత్తులను పట్టుకుని “అమరవీరులకు జోహార్… అమర వీరుల్లారా జోహార్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.అనంతరం కలిగిరి అమ్మ గుడి వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడ కొవ్వొత్తులతో మానవ హారం ఏర్పాటు చేసి అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ… ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తులు పోలీసులని, అలాంటి పోలీసులకు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం ఉందని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎంతోమంది పోలీసులు అమరవీరులయ్యారని, అలాంటి అమరవీరుల త్యాగాలను ఈ తరం ఎప్పటికీ మరువబోదని అన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ, వారి బాటలోనే పయనిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కలిగిరి ఎస్ఐ లతీఫున్నీసా, వింజమూరు ఎస్ఐ, కలిగిరి ఏఎస్ఐ రామచంద్రన్, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *