కలిగిరి సర్కిల్లోని నాలుగు మండలాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. ఓటర్లకు భరోసా
కలిగిరి అక్టోబర్ 19 మన ద్యాస ప్రతినిధి శ్రీకాంత్
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కావలి డీఎస్పీ వెంకట రమణ ఆధ్వర్యంలో వింజమూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ చెన్నకేశవ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. అదేవిధంగా వింజమూరు మండలంలోని శంకవరం గ్రామంలోనూ పోలీసులు కవాతు నిర్వహించారు. కలిగిరి మండలంలోని గంగిరెడ్డిపాళెం గ్రామంలో కూడా డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా కావలి డీఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం రవాణా, పంపిణీతో పాటు నగదు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం లేదా ఒత్తిడికి గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నగదు రవాణా చేసేవారు తగిన ఆధారాలు కలిగి ఉండాలని, సరైన ఆధారాలు లేని నగదు తరలింపుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.కలిగిరి సీఐ పి. సుబ్బారావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.కలిగిరి ఎస్ఐ సయ్యద్ లతీఫున్నిషా మాట్లాడుతూ.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.ప్రజల్లో ఎన్నికలపై అవగాహన పెంపొందించడం, ఓటర్లకు భద్రతపై నమ్మకం కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం ఈ ఫ్లాగ్ మార్చ్ల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. వింజమూరుతో పాటు గంగిరెడ్డిపాళెం, శంకవరం గ్రామాల్లో నిర్వహించిన పోలీసు కవాతుల ద్వారా ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, వింజమూరు, జలదంకి, కొండాపురం పోలీస్ స్టేషన్లకు చెందిన సుమారు 45 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.