ఎస్సీ కాలనీ వాసుల సమస్యకు తక్షణ పరిష్కారం.. అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు.
*కలిగిరి, అక్టోబర్ 18, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:*
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులపై *రాజముద్ర దినపత్రికలో ప్రచురితమైన కథనానికి* అధికారులు తక్షణమే స్పందించారు.వెంకన్నపాలెం గ్రామం, *ఎస్సీ కాలనీ చర్చి దగ్గర* సిమెంట్ రోడ్డుపై శనివారం కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు, మురుగు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయిన విషయం తెలిసిందే. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్డు మొత్తం చెరువులా మారి, ఆ నీరు ఇళ్లలోకి చేరే ప్రమాదం ఏర్పడింది. దీనిపై కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, ఈ విషయాన్ని రాజముద్ర పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.
*JCBతో పూడికతీత పనులు షురూ:*
కథనానికి స్పందించిన కలిగిరి మండల అధికారులు, వెంకన్నపాలెం పంచాయతీ అధికారులు ఆదివారం ఉదయం నుంచే *JCB యంత్రాన్ని* రంగంలోకి దించారు. సిమెంట్ రోడ్డుపై నిలిచిన నిలువ నీటిని తొలగించడంతో పాటు, డ్రైనేజీలో పేరుకుపోయిన పూడిక, చెత్తను తొలగించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. నీరు సాఫీగా వెళ్లేలా కాలువలను లోతు చేస్తున్నారు.
*సంతోషంలో కాలనీ వాసులు:*
రెండు రోజులుగా దుర్గంధం, దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన అధికారులకు వెంకన్నపాలెం ఎస్సీ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాదని కోరుతున్నారు.
