​లింగ వివక్షను రూపుమాపి బాలికలను ప్రోత్సహించాలి..ప్రగతి సంస్థ కోఆర్డినేటర్ జయలక్ష్మి.

​రేణిగుంట అక్టోబర్ 10.
అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని రేణిగుంట మండలం చైతన్యపురంలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సంస్థ రేణిగుంట మండల కోఆర్డినేటర్ జయలక్ష్మి మాట్లాడుతూ పురాతన కాలం నుంచి నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగం వరకు పురుషాధిక్య సమాజంలో బాలికలు పలు రూపాల్లో వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ స్థాయిలో ఆహారం, విద్య, వైద్య విషయాల్లోనూ అసమానతలు కనిపిస్తున్నాయని తెలిపారు. అబ్బాయిలను ప్రైవేటు పాఠశాలలకు, అమ్మాయిలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే ధోరణి మారాలని, ఇలాంటి సామాజిక వివక్షను రూపుమాపేందుకు విస్తృత అవగాహన సదస్సులు అవసరమని పేర్కొన్నారు.
​పాపానాయుడుపేట క్లస్టర్ కోఆర్డినేటర్ సుభాష్ చంద్రయ్య మాట్లాడుతూ ఆడపిల్లల విద్య దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. బాలికలు ఉన్నత చదువులు చదివి తమ లక్ష్యాలను సాధించాలని, ఆడపిల్ల కుటుంబానికి భారం కాదని, బలమైన ఆధారమని పునరుద్ఘాటించారు. లింగ వివక్షను వీడి బాలికలకు చదువుకునే అవకాశం కల్పించి, వారు ఉన్నతంగా ఎదిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో బాలికల హక్కులపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సంస్థ సిబ్బంది సురేష్, సుమలత, రాజేశ్వరి, వెంకటేష్, గంగోత్రి, గ్రామ పెద్దలు, ఎస్సీవి నాయకులు, స్నేహ బాలల సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *