మన ద్యాస, నెల్లూరు, సెప్టెంబర్ 17 : నెల్లూరు పార్లమెంటు పరిధిలోని మాదిగ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, మాదిగ సోదరులకు ఇచ్చిన మాటకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనట్లు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరులో నిర్వహించిన ‘మాదిగల ఆత్మీయ సమ్మేళనం’లో ఎంపీ వేమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుందామని ఇచ్చిన మాట ప్రకారమే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు వెల్లడించారు.తెలుగుదేశం పార్టీతోనే మాదిగల ప్రయాణం….ఎన్టీఆర్‌ హయాం నుంచీ మాదిగ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతోనే నిలబడిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే మాదిగ సామాజిక వర్గానికి నిజమైన మేలు జరిగిందని అన్నారు. మాదిగ వర్గానికి చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తే ఎవరూ చిన్నచూపు చూడకూడదని, వారికి ఆప్యాయంగా సాయం చేయాలని చంద్రబాబు తరచూ చెబుతుంటారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి మాదిగ సోదరుల సహకారం ఎంతో గొప్పదని పేర్కొన్నారు.సమ్మేళనంలో పలువురు నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. సమస్యలకు సంబంధించిన వివరాలతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం తనను కలిసి రిప్రజెంటేషన్‌ అందిస్తే, వాటిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ముగ్గురు ప్రజాప్రతినిధులం సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మాదిగ సోదరులు ఇదే ఆదరాభిమానాలను కొనసాగిస్తూ కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కోరారు. అనంతరం పందింటి సుబ్బయ్య మాట్లాడుతూ…. మాదిగ ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి విచ్చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాదిగలు రాబోయే స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలి అని అన్నారు. మాదిగల సమస్యలను తెలియజేశారు. మాదిగ ఆత్మీయ సమ్మేళానికి విచ్చేసిన మాదిగ సోదరీ సోదరీమణులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు గడ్డం శేఖర్, ఎస్సీ ఎస్టీ బీసీ సేవాసమితి కాకి శ్రీనివాసులు, పల్లాల, శ్రీనివాసులు, డేగా రాఘవేంద్ర, కుడుముల సుబ్బారావు, కొమ్మల కృష్ణయ్య, డేనియల్, పలిగిలి చిన్నయ్య, సల్మాన్, కే. దాసు, ఏ. కామయ్య, పీ. సంజీవయ్య, విజయ్ కుమార్, కుడుముల సుధాకర్, ఎమ్మార్పీఎస్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *