తిరుపతి ఆగష్టు 5.
తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామంలో వెలసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి సుబ్రమణ్య స్వామివారి ఆడి కృతిక మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజైన ధ్వజారోహణం సందర్భంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న తుడా ఛైర్మన్‌కు ఆలయ అర్చకులు, గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ధ్వజారోహణ ఘట్టాన్ని పురస్కరించుకుని ఆకాశాన్ని తాకేలా బాణాసంచా కాల్చి, మంగళ వాయిద్యాల నడుమ ఆయనను ఆలయంలోనికి ఆహ్వానించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం, అర్చకులు దివాకర్ రెడ్డి కి వేద ఆశీర్వచనాలు అందించి, శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ మాట్లాడుతూ… శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి సుబ్రమణ్యస్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, నియోజకవర్గంతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఆడి కృతిక వేడుకలను గ్రామస్తులంతా ఐక్యమత్యంతో, ఆధ్యాత్మిక శోభతో జరుపుకోవడం అభినందనీయమన్నారు
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని ఆలయ నిర్వాహకులకు, అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి,తనపల్లి,కుట్రపాకం గ్రామకమిటి అధ్యక్షులు సందీప్ రెడ్డి,భారత్ రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు బాల రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి,చెంచురెడ్డి, సుజన్ రెడ్డి,కూటమి నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు,ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


