- ప్రభుత్వ విప్ గణబాబు…

గోపాలపట్నం మన ధ్యాస ప్రతినిధి జూలై 25 : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే చారిత్రాత్మక ఘట్టం ఆసన్నమైందని ప్రభుత్వ విప్ గణబాబు పేర్కొన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్(అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం)ఈ ఆగస్టు 1వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు.ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని గోపాలపట్నంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ విప్ గణబాబు ఘనంగా సంబరాలు నిర్వహించారు.ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు, ఈ ప్రాంత ఉన్నతమైన ప్రగతికి చిహ్నంగా ఆయన పావురాలను గాల్లోకి ఎగురవేశారు.ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో అత్యంత వేగంగా పనులు పూర్తి చేసుకున్న ఈ విమానాశ్రయం,ఉత్తరాంధ్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.రవాణా సదుపాయాలకే పరిమితం కాకుండా పారిశ్రామిక,పర్యాటక,వాణిజ్య రంగాల్లో భారీ మార్పులకు,వేలాది మంది యువతకు ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం కేంద్ర బిందువు కానుందని తెలిపారు. హైదరాబాద్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగో, ఉత్తరాంధ్రకు భోగాపురంఎయిర్పోర్ట్ ఒక గేమ్ చేంజర్ కాబోతుందన్నారు.ఆగస్టు1న జరగబోయే ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ వేడుకలను ఉత్తరాంధ్రలోని ప్రతి ఒక్కరూ ఒక పండుగలా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు,పౌరులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.