మన ధ్యాస ,నిజాంసాగర్/ ఎల్లారెడ్డి , కామారెడ్డి, జూన్ 30: ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా, మానవీయ దృక్పథంతోవ్యవహరించాలని మల్టీ జోన్–I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ అధికారులకు సూచించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,ఐపీఎస్ తో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి, అనంతరం స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, మాల్ఖానా, ఆయుధాల భద్రత, రికార్డులు, రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ.. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, కేసుల వివరాలను నిర్ణీత గడువులోగా సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. మిస్సింగ్, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలనిసూచించారు.మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సీసీటీఎన్‌ఎస్–2.0, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి డిజిటల్ సేవలను సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, దర్యాప్తును మరింత పటిష్టం చేయాలని తెలిపారు.రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అనుమానిత నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు బీట్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. పాపిలాన్ పరికరం ద్వారా వేలిముద్రల ఆధారంగా నేరస్తులను గుర్తించే చర్యలను విస్తృతం చేయాలని పేర్కొన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసింగ్ అధికారులు గ్రామాలను తరచూ సందర్శించి స్థానిక సమాచారాన్ని సేకరించి పోలీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు.అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఐజీపీ, విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉందని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజారెడ్డి, ఎస్‌ ఐ రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *