తిరుపతి జూన్ 6.
భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో అడుగడుగునా భక్తుల సెంటిమెంట్లతో, స్థానిక చరిత్రతో ముడిపడి ఉన్న విషయాలపై టీటీడీ అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు స్థానికులను, భక్తులను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భూలోకంలో దర్శించిన మొట్టమొదటి మహనీయుడు, పరమ భక్తుడు శ్రీ శరభయ్య యాదవ్ . అలాంటి మహానుభావుడికి దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వడంలో టీటీడీ యాజమాన్యం మరియు నాన్-లోకల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధి డి.ఎమ్.సి. భాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తిరుమలలోని అత్యంత కీలకమైన, భక్తుల రద్దీ ఉండే జీఎన్సీ టోల్ గేట్ సర్కిల్‌కు శ్రీ శరభయ్య యాదవ్ పేరు పెట్టాలని యాదవ కుల పెద్దలందరూ ఏకగ్రీవంగా విన్నవించారు. దీనికి మద్దతుగా తిరుపతిలోని ప్రముఖులందరూ అలిపిరి వేదికగా ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఇంతటి చారిత్రక నేపథ్యం, స్థానిక ప్రజల సెంటిమెంట్ ఉన్నప్పటికీ, టీటీడీలోని కొందరు అధికారులు దీన్ని పెడచెవిన పెట్టడం దుర్మార్గం.
ప్రజాభిప్రాయాన్ని, భక్తుల కోరికను గౌరవించాల్సిన టీటీడీ… ఒక కమిటీని వేసి శరభయ్య యాదవ్ పేరును సేవా సదన్ నుండి లింక్ రోడ్డుకు వెళ్లే మార్గానికి కేటాయించడం హాస్యాస్పదం. ఆ రోడ్డులో అసలు భక్తుల రాకపోకలు చాలా తక్కువ. జనం తిరగని, ఎవరికీ తెలియని ఒక మారుమూల ప్రాంతానికి ఆ మహనీయుని పేరు పెట్టడం ఆయనను గౌరవించడం కాదు, ఘోరంగా అవమానించడమే. కోట్లాది మంది యాదవుల, వేంకటేశ్వర స్వామి భక్తుల భావాలను దెబ్బతీయడమే. స్వామి వారిని మొదట చూసిన మహనీయుని పేరును ఎక్కడో మూలన ఉన్న రోడ్డుకు పెడతారా, మీరు చేసిన పని కరెక్టేనా, ఇది ఏ రకమైన న్యాయం అని డి.ఎమ్.సి. భాస్కర్ ప్రశ్నించారు.
టీటీడీని ఏలుతున్న పరాయి పాలకులారా, నాన్-లోకల్ అధికారులు లారా .. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ మొండివైఖరిని వీడి, భక్తుల సెంటిమెంట్‌ను గౌరవించండి. తక్షణమే ఆ కమిటీ నిర్ణయాన్ని రద్దు చేసి, జీఎన్సీ టోల్ గేట్ సర్కిల్‌కు శ్రీ శరభయ్య యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించాలి. ఒకవేళ టీటీడీ యాజమాన్యం స్పందించి ఈ పేరు పెట్టకపోతే, స్థానిక ప్రజలు, భక్తులు, యాదవ సంఘాల ఆధ్వర్యంలో మేమే స్వయంగా వెళ్లి ఆ సర్కిల్‌కు “శ్రీ శరభయ్య యాదవ్ సర్కిల్” అని నామకరణం చేస్తాం అని డి.ఎమ్.సి. భాస్కర్ హెచ్చరించారు. తిరుమల స్థానికతను, చరిత్రను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
