రేణిగుంట మన ధ్యాస మే 5.
రేణిగుంట మండలం కరకంబాడిలోని రాస్ కార్యాలయంలో కిశోరీ వికాసం కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేణిగుంట ఐసిడిఎస్ ప్రాజెక్టు శిశు అభివృద్ధి పథక అధికారి (సీడీపీఓ) కృష్ణవేణి , పర్యవేక్షకులు హేమావతి, అనంతలక్ష్మి, బాల వికాస సమన్వయకర్తలు నాగేంద్ర, భారతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పెంచలమ్మ, రజిని మరియు సుమారు 60 మంది కిశోరీ బాలబాలికలు హాజరయ్యారు.
​ఈ సందర్భంగా శిశు అభివృద్ధి పథక అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ.. కిశోరీ బాలబాలికల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా కిశోరీ వికాసం కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా పిల్లలకు విద్య యొక్క ప్రాముఖ్యత, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, ఆర్థిక స్వావలంబన, బాల్య వివాహాల నిరోధం, పౌష్టికాహారం, పరిశుభ్రత మరియు జీవన నైపుణ్యాల వంటి వివిధ అంశాలపై దశలవారీగా అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు.
​సెలవుల్లో లభించిన ఈ అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకొని, ఇక్కడ తెలుసుకున్న సమాచారాన్ని గ్రామంలోని ఇతర బాలబాలికలకు కూడా వివరించాలని ఆమె కోరారు. అలాగే, ప్రతి మంగళవారం గ్రామ స్థాయిలో కిశోరీ బాలబాలికలకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతి అంశంపై కూలంకషంగా శిక్షణ అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలు ఉత్సాహంగా అవగాహన పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *