(ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర.

బంగారుపాల్యం, మన ధ్యాస ,ఏప్రిల్ 17. రిపోర్టర్ కమల్ రెడ్డి

(ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర మాట్లాడుతూ, ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లుగా భావించడం పూర్తిగా తప్పని విద్యార్థులకు సూచించారు. ఇటీవల వెలువడిన పరీక్ష ఫలితాల నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు నిరాశ, ఆవేదనకు గురవుతున్న పరిస్థితులు ఆందోళనకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఒక పరీక్షలో వచ్చిన ఫలితం జీవితానికి తీర్పు కాదు. ఓటమి అనేది గెలుపుకు దారితీసే మొదటి మెట్టు మాత్రమే. ఒక్కసారి విఫలమయ్యామంటే అంతే అన్న భావన పూర్తిగా తప్పు. పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తే విజయం తప్పకుండా మీది అవుతుంది” అని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. “మార్కుల కోసం పిల్లలపై అనవసర ఒత్తిడి పెంచడం సమాజానికి మంచిది కాదు. పిల్లలు ఫెయిల్ అయ్యారని తల్లిదండ్రులు మందలించడం, అవమానించడం వంటి చర్యలు తీసుకుంటే అది వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. మార్కుల కంటే పిల్లల ప్రాణం, భవిష్యత్తు ఎంతో విలువైనవి అన్న విషయం ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకోవాలి” అని అన్నారు. పరీక్షల్లో విఫలమైన విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పి, “పరీక్షలు మళ్లీ రాయొచ్చు… మేము నీ వెనుక ఉన్నాం” అనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు. ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఉంటే విద్యార్థులు మానసిక ఒత్తిడిని సులభంగా అదిగమిస్తారని ఆయన పేర్కొన్నారు. చివరిగా, విద్యార్థులు క్షణిక ఆవేశానికి లోనై ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, పట్టుదలతో శ్రమిస్తే వచ్చే ప్రయత్నంలో ఖచ్చితంగా విజయం సాధించవచ్చని జన్నావుల సురేంద్ర పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *