

మన న్యూస్ : రెబల్ రాజుకు ఆహ్వానం…! త్రిబుల్ ఆర్ కు ఆర్ హెచ్ వి ఎస్ పిలుపు సరేనన్న ఏపీ ఉపసభాపతి తిరుపతి, నవంబర్ అయోధ్యకు వచ్చే ఏడాది మార్చిలో శ్రీరామరథయాత్రను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ ( ఆర్ హెచ్ వి ఎస్ ) నిర్వహించనున్నది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ లతోపాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ మేరకు సన్నాహక కార్యక్రమాలు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి గుండ్రాజు సుకుమార్ రాజు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి రాజు, జిల్లా అధ్యక్షులు వి సుబ్రహ్మణ్యం రాజుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ మారాజు తిరుపతి పర్యటనలో భాగంగా తిరుచానూరు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించి శ్రీరామ రథయాత్రకు రావలసిందిగా ఆహ్వానించారు. దీనికి త్రిబుల్ ఆర్ స్పందించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని తప్పకుండా శ్రీరామ రథయాత్రకు కుటుంబ సమేతంగా వస్తానని చెప్పడం ఆనందంగా ఉందని అధికార ప్రతినిధి సుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణమరాజు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యంలో రామ రాజ్య స్థాపన కోసం, హిందూ భావజాలాలతోపాటు ఆధ్యాత్మికత సనాతన ధర్మాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరే విధంగా కార్యక్రమాలను రూపొందించడం ఆర్ హెచ్ వి ఎస్ ప్రతినిధులను అభినందించారు. రథయాత్ర సాగే ప్రాంతంలో ప్రతి ఇంటిపై జైశ్రీరామ్ జండా ఎగిరే విధంగా శ్రీరామ సేవకులు కృషి చేయాలని త్రిబుల్ ఆర్ పిలుపునిచ్చారు. భారతదేశం తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మవారిని ప్రార్థించినట్లు రఘురామ కృష్ణమరాజు పేర్కొన్నారు. తిరుపతి నుండి అయోధ్యకు సాగే శ్రీ రామ రథయాత్ర ముగిసిన తరువాత తదుపరి కార్యక్రమం కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు రెండవ దపా శ్రీరామ రథయాత్ర ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ప్రతినిధులు సుకుమార్ రాజు, శ్రీదేవి రాజు,సుబ్రహ్మణ్యం రాజు పేర్కొన్నారు.