

మన న్యూస్: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిటిడి ఈవో శ్యామల రావు, జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సివి అండ్ ఎస్వో శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరిలో ఒకరిగా అమ్మవారి దర్శనం చేసుకునే నేను, పట్టు వస్త్రాలు సమర్పించే ఘటనలను టీవీల్లో చూడడం, పత్రికల్లో చదవడమో చూశా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తల్లిదండ్రుల పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడికి రుణపడి ఉన్నానని అన్నారు, గురువారం రోజున తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవడం, అదే రోజున శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. సిఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసువచ్చేలా చర్యలు చేపట్టామని మీడియాతో మాట్లాడారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, విజివో సదాలక్ష్మి, ఏవీఎస్వో వై.సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.