

కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: ఏప్రిల్ 23: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో జోరుగా బెల్ట్ షాపు లు నిర్వహిస్తున్న అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం బెల్టు షాపులు నిర్వహిస్తే తక్షణమే చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఒకవైపు చెబుతూనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో స్థానిక ఐదు రోడ్ల కూడలి, మల్లెపల్లి రోడ్డు, కనుమ పోలేరమ్మ గుడి దగ్గర బ్రహ్మ సాగర్ రోడ్డు మరియు జిల్లా పరిషత్ పాఠశాల పక్కన అమ్మవారి శాల మొదలగు ప్రాంతాల్లో హోటళ్ళు, కూల్ డ్రింక్ షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా నిర్వహిస్తున్నట్లు వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వచ్చిన విషయం విదితమే.గతంలో కూడా చాలా పత్రికల్లో వచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదు. విద్యార్థులకు,ప్రజలకు పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు విరివిగా బెల్టు షాపులో దర్శనమిస్తున్నాయని రాత్రిపూట 11 గంటల వరకు కూడా మద్యం విక్రయిస్తుండటంతో తాగుబోతుల వల్ల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాసులకు కక్కుర్తి పడే అధికారులు బెల్ట్ షాపు నిర్వాహకులపై చర్యలకు నోచుకోవడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇకనైనా ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు భీ.మఠం పోలీసు వారు పుణ్యక్షేత్రంలో మద్యం విక్రయ దరులపై చర్యలు తీసుకొని బెల్టుషాపుల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టి పుణ్యక్షేత్రం లో మద్యం విక్రయాలు అరికట్టాలని మరియు బ్రహ్మంగారిమఠం మండలం వ్యాప్తంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై తక్షణమే చర్యలు తీసుకొని బెల్ట్ షాపు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో AIYF జిల్లా సహాయ కార్యదర్శి నవీన్ రాయల్, జిల్లాసమితి సభ్యులు లోకేష్,సుధాకర్,వెంకటేష్ లు పాల్గొన్నారు.
