

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో, ఏప్రిల్, మే, నెలలో ఎండ వేడిమి తీవ్రంగా ఉండడం వలన నేలలో ఉన్న పోషకాలు వేడికి గాలికి ఆవిరి అయిపోవడమే కాకుండా సారవంతమైన మట్టి కూడా కొట్టుకుని పోతుందని వ్యవసాయ అధికారి తిరుపతిరావు అన్నారు. పాంచాలి గ్రామంలో రైతు నారాయణరావు పొలంలో నవధాన్యాలను చల్లిస్తూ నవధాన్యాల సాగు నేలకు రక్షణ కవచం అని రైతులు తప్పనిసరిగా నవధాన్యాలు వేసుకుని కలియ దున్నుకుంటే నేల సారవంతం అవ్వడమే కాకుండా సారవంతమైన మట్టి కొట్టుకుని పోకుండా రక్షణ కవచంగా పనిచేస్తుందని తెలిపారు. 500 రూపాయలు ఖర్చు కోసం చూడకుండా తప్పనిసరిగా నవధాన్యాలను చల్లుకోవాలని దీని వలన ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక లాభాలు ఉన్నాయని అడపా దడపా కురిసిన వర్షాలు వలన చేరిన నీటిని ఎక్కువ కాలం నిలువ చేయడం వలన భూమి వేడెక్కకుండా ఉండి భూమిలో అనేక జాతుల ఉపయోగపడే సూక్ష్మ జీవులు వృద్ధి చెంది సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతాయని సేంద్రియకర్భనాన్ని భూమిలో ఒక్క శాతానికి తీసుకు రాగలిగితే ఎలాంటి ఎరువులు వాడకుండానే పంటలు పండించవచ్చని తెలిపారు. నవధాన్యాలు కావలసిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని లేదా ప్రకృతి వ్యవసాయ బృందాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య యల్ వన్ తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.