రేణిగుంట
తలసేమియా వంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు రక్తదాతలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ‘యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పసేలి రాజేష్ పిలుపునిచ్చారు.
ఆదివారం గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో అఖిల భారత ఎన్జీవో వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కె.బి.ఆర్. ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం, సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రేణిగుంట మండలానికి చెందిన పసేలి రాజేష్ చేస్తున్న సామాజిక, రక్తదాన సేవలను గుర్తించిన కె.బి.ఆర్. ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలరాజు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
సమావేశంలో రాజేష్ ప్రసంగిస్తూ…
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు నిరంతరం రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, ఒక్కో చిన్నారికి 10 నుంచి 15 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆపదలో ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు యువత, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.“రక్తదానం చేయండి.. ప్రాణదాతలు అవ్వండి” అని తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన పలు స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకులు, ప్రముఖ సమాజ సేవకులు తదితరులు పాల్గొన్నారు.


