నిజాంసాగర్, నవంబర్ 3 మన ధ్యాస : పంటలు సాగు చేసుకుంటూ భూములు కబ్జాలో కలిగి ఉన్న అర్హులైన ప్రతి రైతుకు పట్టా పాస్ పుస్తకాలు అందజేస్తామని బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మొహమ్మద్‌నగర్ మండలంలోని తున్కిపల్లి గ్రామ శివారులో గల 532 సర్వే నంబర్‌లోని భూములను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సదరు సర్వే నంబర్‌లో భూములు సాగు చేసుకుంటూ కబ్జాలో ఉన్నప్పటికీ పట్టా పాస్ పుస్తకాలు పొందని రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.అనంతరం మొహమ్మద్‌నగర్ మండలంలోని తెల్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ-సర్వే పనులను కూడా ఆర్డీఓ పరిశీలించారు. సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతుల భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తున్కిపల్లి సర్పంచ్ రాములు, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, తహసీల్దార్ లత, ఆర్‌ఐ రాధిక, తెల్లాపూర్ గ్రామానికి చెందిన జీపీఓలు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *