రేణిగుంట (అక్టోబర్ 27):
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీ.పాలెం పంచాయితీ, గురవరాజుపల్లి సెగ్మెంట్ పరిధిలోని ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ (బీజేపీ) అభ్యర్థి, మాజీ సర్పంచ్ కుర్రకాల్వ రాణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ కూటమి వ్యూహాత్మక అడుగులు, స్థానిక ప్రజల మద్దతుతో ఈ విజయం సాధ్యమైంది. ఆమె ఎన్నికను అధికారులు అధికారికంగా ప్రకటించడంతో కూటమి నాయకులు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు:
రాణమ్మ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు ఎన్డీఏ శ్రేణులకు రాణమ్మ తనయుడు, తిరుపతి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కుర్రకాల్వ వేణు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి నాయకులు, కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం సుసాధ్యమైందని ఆయన కొనియాడారు.
మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతాం: కుర్రకాల్వ రాణమ్మ
ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం రాణమ్మ మాట్లాడుతూ… తన గత పరిపాలనా అనుభవంతో జీ.పాలెం, గురవరాజుపల్లి గ్రామాల్లో బిటి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు వంటి మౌలిక వసతులను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ది చేస్తానని స్పష్టం చేశారు. ఎంపీటీసీ నిధులతో పాటు ప్రభుత్వ ప్రత్యేక నిధులతో ఈ రెండు గ్రామాలను నియోజకవర్గంలోనే ‘మోడల్ గ్రామాలు’గా తీర్చిదిద్దుతానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని నూతన ఎంపీటీసీ రాణమ్మను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.


