
కోడూరు, అక్టోబరు 18: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కోడూరు నియోజకవర్గపు మండలాల లో నిర్వహించే ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికల బ్యాలెట్ బాక్స్ లను నిల్వ ఉంచే స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ సెంటర్ ల వద్ద అవసరమైన ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆదేశించారు. కోడూరు నియోజకవర్గ పరిధిలో గల మండలాల స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా కోడూరు హార్టికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లను ఆదివారం తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్ తో కలిసి జేసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద, కౌంటింగ్ సెంటర్ల వద్ద చేయవలసిన ఏర్పాట్ల పై అధికారులకు, సిబ్బందికి జేసి దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోడూరు తహశీల్దార్ అమర్నాథ్, కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఇతర మండలాల తహశీల్దార్లు , ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

