కలిగిరి, అక్టోబర్ 17, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:*
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం *వెంకన్నపాలెం గ్రామం, ఎస్సీ కాలనీ చర్చి దగ్గర* సిమెంట్ రోడ్డు వర్షపు నీటితో జలమయంగా మారింది. శనివారం కురిసిన భారీ వర్షానికి రోడ్డు మొత్తం చెరువును తలపిస్తోంది.గత శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు కూడా అదే రోడ్డుపై నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నిలిచిన నీరు ప్రస్తుతం ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*దుర్గంధం, దోమల బెడద:*
రోడ్డుపై రెండు రోజులుగా నిలిచిన నీటి నుంచి తీవ్ర దుర్గంధం వస్తోందని, దోమలు విజృంభించాయని స్థానికులు వాపోతున్నారు. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని భయపడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారని, పాఠశాలకు వెళ్లే పిల్లలు బురద నీటిలోనే నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని, ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారని తెలిపారు.
*అధికారులు స్పందించాలని డిమాండ్:*
ఈ విషయంపై ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మరియు కలిగిరి మండల అధికారులు వెంటనే స్పందించి సిమెంట్ రోడ్డుపై ఉన్న నిలువ నీటిని తొలగించి, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వెంకన్నపాలెం ఎస్సీ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.