బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం – పరిశీలకులు గంజాం రాఘవేంద్ర*టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఫైర్
*దర్శి, అక్టోబర్ 12, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్శి పట్టణంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రత్యేక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధ్యక్షత వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర హాజరయ్యారు.
*బీసీలే వెన్నెముక – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి:*
ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.”బీసీలు లేనిదే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంది, కానీ రాజ్యాధికారం ఇవ్వలేదు. కానీ మా కూటమి ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చే తీర్పుతో వైసీపీ కనుమరుగు అవ్వాలి. వైసీపీకి బుద్ధి చెప్పాలి. బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోంది. బీసీలంతా ఐక్యంగా ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించాలి” అని పిలుపునిచ్చారు.
*40% రిజర్వేషన్లు కల్పిస్తాం – గంజాం రాఘవేంద్ర:*
అనంతరం పరిశీలకులు గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ…
“స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో వైఎస్సార్‌సీపీ అనుసరించిన ద్వంద్వ వైఖరిని, వారి మోసాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలి. బీసీ సోదరులంతా ఈ ఎన్నికల్లో ఏకతాటిపైకి రావాలి” అని అన్నారు.
*సమావేశంలో…*
ఈ సమావేశంలో దర్శి నియోజకవర్గంలోని దర్శి, ముండ్లమూరు, కురిచేడు, బేస్తవారిపేట, దొనకొండ మండలాలకు చెందిన బీసీ నాయకులు, బీసీ సోదరులు, టీడీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై వారి సందేహాలను నివృత్తి చేశారు.
