నెల్లూరు, అక్టోబర్ 6 (మన న్యూస్ ప్రతినిధి నాగరాజు

నెల్లూరు నగర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా నూతన 20వ డివిజన్‌ (బాలాజీనగర్ – పాత 15వ డివిజన్)లో ఒక్కసారిగా జనసేన జెండాలు వీధి వీధినా దర్శనమివ్వడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. రాత్రికి రాత్రే పెద్ద సంఖ్యలో జెండాలు ఏర్పాటు కావడంతో ఈ రాజకీయ కదలిక వెనుక మతలబేంటనే చర్చ జోరుగా సాగుతోంది.నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీల మధ్య డివిజన్ల కేటాయింపుపై ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలాజీనగర్ ప్రాంతంలో జనసేన జెండాల హడావుడి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ డివిజన్‌ను కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించారా? లేక జనసేన నేతలు తమ బలాన్ని చాటుకునేందుకు ముందస్తుగా జెండాలు ఏర్పాటు చేశారా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.గత కొంతకాలంగా ఈ డివిజన్‌లో జనసేన కార్యకర్తలు చురుకుగా తిరుగుతున్నారని, స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా జెండాలు వెలవడంతో ఎన్నికలకు సంబంధించి ఏదైనా సంకేతాలు ఇస్తున్నారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.అయితే జెండాల ఏర్పాటుకు గల అసలు కారణం, 20వ డివిజన్ కేటాయింపుపై ఏదైనా అధికారిక నిర్ణయం జరిగిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై సంబంధిత పార్టీ వర్గాల నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *