జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ.
రేణిగుంట, అక్టోబరు 6 (ప్రభ ఎక్స్ ప్రెస్): జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎగ్జిక్యూటివ్ సమావేశం మంగళవారం రేణిగుంట పాత చెక్‌పోస్టు వద్ద ఉన్న జాప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాప్ రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి హాజరై సంఘం కార్యకలాపాలు, జర్నలిస్టుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. జిల్లాల వారీగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, జర్నలిస్టుల గుర్తింపు, భద్రత తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం తరఫున సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సభ్యుల మధ్య సమన్వయం పెంచుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువచ్చి, వాటిపై సంబంధిత వర్గాలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన జాప్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొని పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సంఘం భవిష్యత్ కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాప్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మణి, జిల్లా ప్రధాన సలహాదారులు వరప్రసాద్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముని రామయ్య, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, సభ్యులు శివ, కిరణ్, అప్సర్, రమేష్, సంకేష్, శ్రీనివాసులు, మహమ్మద్, లోకేష్, బాల, విజయ్, తేజ తదితరులు పాల్గొన్నారు.

