రేణిగుంట (అక్టోబర్ 01):
తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం పక్కన ఉన్న పాంచాలి నగర్ 14వ వార్డులోని ఎంపీపీ మోడరన్ పాఠశాలలో మహాత్మా గాంధీ 157వ జయంతి ముందస్తు వేడుకలను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (హెచ్.ఎం) అరుణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కమిటీ చైర్మన్ జి. రోజా, భర్త (జి.యం స్ట్రీట్) పూల శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులందరికీ అరటిపండ్లు, చాక్లెట్లను పంపిణీ చేశారు.
గాంధీజీ మార్గం ప్రతి ఒక్కరికీ ఆచరణీయం: పాఠశాల కమిటీ చైర్మన్ జి. రోజా
ఈ సందర్భంగా పాఠశాల కమిటీ చైర్మన్ జి. రోజా మాట్లాడుతూ… “జాతిపిత మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యం అనే మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శదాయకం. క్రమశిక్షణ, పరిశుభ్రత, సమాజ సేవ అనే విశిష్ట గుణాలను విద్యార్థులు చిన్నతనం నుంచే అలవర్చుకోవాలి. గాంధీజీ కన్న కలలను నిజం చేస్తూ, విద్యార్థులు చదువుతో పాటు మంచి నైతిక విలువలను పెంపొందించుకుని దేశ ఉత్తమ పౌరులుగా ఎదగాలి” అని పిలుపునిచ్చారు.
అనంతరం హెచ్.ఎం అరుణ మాట్లాడుతూ… గాంధీజీ జీవిత విశేషాలను, దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన వహించిన నాయకత్వ పాత్రను విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏ. మురళి, సౌజన్య, నిర్మల, భావాజాన్ తదితర ఉపాధ్యాయ సిబ్బందితో పాటు పాఠశాల కమిటీ సభ్యులు, శివ, ముని రాజా, మస్తాన్ వలి, పూల రాము తదితరులు పాల్గొన్నారు.


