జలదంకి, సెప్టెంబర్ 23, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ సుహాసిని పేర్కొన్నారు. మంగళవారం జలదంకి మండలం ఎల్.ఆర్.అగ్రహారం పంచాయతీ కొత్తూరు ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ బిడ్డ జన్మించిన నాటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందన్నారు. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలతో పాటు చిరుధాన్యాలను (మిల్లెట్స్) భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య రక్షణ లభిస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు ఒక వరమని పేర్కొంటూ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా రక్తహీనత నివారణకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సంరక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ రవిచంద్ర, అంగన్వాడీ కార్యకర్తలు పి.మాజునా , ఎం.పరిమళ, సి.హెచ్.నూర్జహాన్, ఆశా వర్కర్ వై.సుభాషినితో పాటు ఆయాలు, పలువురు గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *