టీటీడీ వేద పండితులు సీఎంకు మంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు సమర్పించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి అధికారికంగా ఆహ్వానం అందించింది.
అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రలతో పాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకిదేవి పర్సనల్గా కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి మంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు సమర్పించారు.
ఆహ్వాన పత్రిక అందజేసిన అనంతరం, బ్రహ్మోత్సవాల నిర్వహణ మరియు ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు టీటీడీ ఛైర్మన్, ఈవోలతో సమీక్షించారు. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దర్శనం మరియు వసతి కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వాహన సేవలు, గరుడ సేవ వంటి కీలక ఘట్టాల నిర్వహణలో భద్రతతో పాటు క్యూలైన్లలో తాగునీరు, అన్నప్రసాదాల వితరణ పక్కాగా ఉండాలని సీఎం ఆదేశించారు.
భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రులయ్యేలా బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
