భక్తితో ఉత్సవం – బాధ్యతతో భద్రత..
వినాయక చవితి వేడుకలకు విద్యుత్ శాఖ మార్గదర్శకాలు.
రేణిగుంట విద్యుత్ శాఖ ఏడీ రమేష్.
రేణిగుంట ఉత్తేజిత సెప్టెంబర్ 11.
వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తులు, నిర్వాహకులు తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాలని రేణిగుంట ఏపీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ( ఏడి ) రమేష్ ఒక ప్రకటనలో కోరారు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు పూర్తి రక్షణతో నిర్వహించబడాలని ఆయన సూచించారు.
పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:
అనుభవజ్ఞులతో వైరింగ్: మండపాల్లో విద్యుత్ వైరింగ్ పనులను లైసెన్స్ లేదా గుర్తింపు పొందిన వైర్‌మెన్‌లతో మాత్రమే చేయించాలి.
నాణ్యమైన సామగ్రి: ఐఎస్‌ఐ ( ఐ ఎస్ ఐ ) ప్రమాణాలు కలిగిన నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లను మాత్రమే వాడాలి.
రక్షణ పరికరాలు: విద్యుత్ హెచ్చుతగ్గులు లేదా షార్ట్ సర్క్యూట్ సంభవించినప్పుడు ప్రమాదాలు నివారించడానికి తప్పనిసరిగా ఎంసీబీ లేదా ఈ ఎల్ సి బి లను అమర్చాలి.
జాయింట్లు, తడి ప్రదేశాలు: వైర్లకు అనవసరపు జాయింట్లు లేకుండా చూసుకోవాలి. అలాగే వైర్లను రోడ్లపై అడ్డదిడ్డంగా వేయడం, నీరు లేదా తేమ ఉన్న ప్రాంతాల గుండా లాగడం చేయకూడదు.
ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిషేధం: ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి నేరుగా కరెంట్ లాగడం చట్టరీత్యా నేరం, ప్రాణాలకే ప్రమాదకరం. ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.
ముందస్తు సమాచారం: విగ్రహాల తరలింపు, నిమజ్జన ఊరేగింపుల సమయంలో విద్యుత్ తీగలు అడ్డురాకుండా ఉండేందుకు ముందుగానే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వెంటనే విద్యుత్ సరఫరా ఆపివేసి సిబ్బందికి తెలపాలి.
ఉచిత విద్యుత్ సరఫరా వినియోగించుకోవాలి:
ప్రభుత్వ ఆదేశాల మేరకు గణేష్ మండపాల కోసం ఉచిత విద్యుత్ సరఫరాను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండప నిర్వాహకులు తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను స్థానిక విద్యుత్ శాఖ ( ఏపీఎస్ పీడీసీఎల్ ) కార్యాలయంలో అందజేసి నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు (3 కే డబ్ల్యు ), పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్లు (5 కే డబ్ల్యు ) వరకు ఉచిత విద్యుత్ లోడు అనుమతించబడుతుందని ఏడీ రమేష్ పేర్కొన్నారు.
“భక్తితో ఉత్సవం – బాధ్యతతో భద్రత” నినాదంతో పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు.
జారీ చేసిన వారు:
సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ( ఏడి),
సబ్ డివిజన్ కార్యాలయం, ఏపీఎస్ పీడీసీఎల్ , రేణిగుంట.
