గణేష్ మండపాలకు ఆన్లైన్ అనుమతి, సీసీ కెమెరాలు తప్పనిసరి… డీఎస్పీ శ్రీనివాసరావు.
నిమజ్జనం రూట్, సమయాన్ని ముందస్తుగా పోలీసులకు తెలియజేయాలి…సీఐ జయచంద్ర.
రేణిగుంట సెప్టెంబర్ 03.
తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ నందు వినాయక మండపాల నిర్వాహకులతో డీఎస్పీ శ్రీనివాసరావు అర్బన్ సీఐ జయ చంద్ర,ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన చేసే ప్రతి గణేష్ మండప నిర్వాహకుడు ముందస్తుగా ఆన్లైన్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి విగ్రహం వద్ద భద్రత నిమిత్తం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే పోలీస్ అధికారులను సంప్రదించి అద్దె ప్రాతిపదికనైనా కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా రాత్రి సమయాల్లో మండపాల వద్ద నిర్వాహకులు కనీసం ఒక్కరైనా నిద్రించి కాపలా ఉండాలని, అశ్లీల పాటలు లేదా అసభ్యకర నృత్యాలు నిర్వహించకూడదని స్పష్టం చేస్తూ, ఉత్సవ నిర్వహణ ద్వారా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఐ జయచంద్ర మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా వెంటనే ప్రారంభమవుతున్నందున వీలైనంత త్వరగా, మూడో రోజు నాటికే నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయడానికి నిర్వాహకులు ప్రయత్నించాలని కోరారు. నిమజ్జనం రోజున విగ్రహాన్ని తీసుకెళ్లే మార్గం (రూట్) మరియు బయలుదేరే సమయం వివరాలను ముందుగానే పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ లేదా సీఐకి తెలియజేయాలని ఆదేశించారు. వర్షాభావం వల్ల నీటి వనరులు తక్కువగా ఉన్నందున అందరూ ఒకే ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉందని, దీనివల్ల ఏర్పడే రద్దీ మరియు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. గత సంవత్సరం పంచాయతీ రాజ్, రెవెన్యూ, విద్యుత్ శాఖ మరియు ఉత్సవ కమిటీల సమన్వయంతో ప్రశాంతంగా పూర్తి చేసినట్లే ఈసారి కూడా అదే స్ఫూర్తితో శాంతియుతంగా ఉత్సవాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు

