రేణిగుంట ఆగష్టు 23.

​ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలోని విలువైన సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేసి, పదవీ విరమణ అనంతరం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే ఆశతో పనిచేస్తుంటే.. అతని భవిష్యత్ ఆర్థిక భద్రతను అనిశ్చితిలోకి నెట్టే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఒపీస్ ) పునరుద్ధరించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగుల్లో చైతన్యం తీసుకురావడం, ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా సెప్టెంబర్ 1న గుంటూరులో “సమర శంఖం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులో జరగనున్న “సమర శంఖం” పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు.
​దేశంలోని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ఐదు రాష్ట్రాలు ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్ వైపు మారాయని, ఇతర రాష్ట్రాలు తమ ఉద్యోగుల భవిష్యత్ పెన్షన్ భద్రతపై నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీపీఎస్ ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వం గంభీరంగా పరిగణించాలని కోరారు. ప్రజాప్రతినిధులకు ఆర్థిక భద్రత కల్పించినట్లే, 35-40 ఏళ్లు సేవ చేసిన ఉద్యోగుల పదవీ విరమణ భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పెన్షన్ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చే బహుమతి కాదని, ఉద్యోగి సేవ ద్వారా సంపాదించే ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు.
​ఈ “సమర శంఖం” కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీపీఎస్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే సీపీఎస్ రద్దుతో పాటు పిఆర్‌సి, ఐఆర్, పెండింగ్ డీఏలు మొదలైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు వంకీపురం పవన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీ మోహన్, మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటూరు రేఖా, కార్యవర్గ సభ్యులు నక్క రామచంద్ర, జయచంద్ర, పవన్ కళ్యాణ్, రమాదేవి, హర్ష తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *