తవణంపల్లి, ఆగస్టు 22 మన జైత్రయాత్ర (అనంత కుమార్ )

తవణంపల్లి మండలంలోని తవణంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి కార్యక్రమంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, రక్షణతో పాటు ప్రాథమిక విద్య, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే అంశాలపై శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా శిక్షణలో భాగంగా నవచేతన కార్యక్రమం, సమ్మిళిత విద్య తదితర అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు క్షుణ్ణంగా వివరించారు. గర్భధారణ దశ నుంచి శిశువు జన్మించిన అనంతరం మూడేళ్ల వయస్సు వరకు తల్లి, బిడ్డ ఆరోగ్యం, పోషణ, రక్షణ, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.అలాగే మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన బోధన ద్వారా ప్రీస్కూల్ విద్య అందించాలని తెలిపారు. పిల్లల వయస్సు, అవసరాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వారి మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని వేడివేడిగా తయారు చేసి చిన్నారులకు అందించడంతో పాటు, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శిక్షణలో తెలియజేశారు. తల్లులతో గ్రూపులు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు.పిల్లల తల్లిదండ్రులతో సమన్వయం పెంచుకుని వారి ఆరోగ్యం, ఎదుగుదల, విద్యా పురోగతిపై అవగాహన కల్పించడంతో పాటు పునఃచర్చ, సమ్మిళిత విద్య వంటి అంశాలపై కూడా శిక్షణ ఇచ్చారు. ప్రతి చిన్నారికి సమాన అవకాశాలు కల్పిస్తూ వారి అవసరాలకు అనుగుణంగా విద్య, సంరక్షణ అందించాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలపై ఉందని వివరించారు.ఈ కార్యక్రమంలో డీఆర్పీలు దేవేంద్ర, రమేష్, రాజేష్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు నాగరత్నం, లావణ్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణలో చురుకుగా పాల్గొని కార్యక్రమం ద్వారా తమకు ఉపయోగకరమైన విషయాలను తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *