రేణిగుంట (ఆగష్టు 19): రేణిగుంట పట్టణంలో గత మూడు రోజులుగా (ఈ నెల 17, 18, 19 తేదీల్లో) అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ గంగమ్మ జాతర మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. జాతర చివరి రోజున అమ్మవారిని పసుపుతో సిద్ధం చేసి, అలంకరించి రేణిగుంట పట్టణంలోని ముఖ్య పురవీధుల గుండా వైభవంగా ఊరేగించారు. అనంతరం నడివీధిలోని సూలం వద్ద గంగమ్మను శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు.

​మూడు రోజు జరుగు ఈ శోభాయాత్రను , శ్రీ గంగమ్మ తల్లి కి మొక్కుబడులు చెల్లించుకోవడానికి రేణిగుంట పట్టణం, మండల ప్రజలతో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

​చివరి రోజున జనసందోహం భారీగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. రేణిగుంట డిఎస్పి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, అర్బన్ సిఐ జయచంద్ర నేతృత్వంలో పట్టణవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల దర్శనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎస్ఐ శ్రీనివాసులుతో పాటు డివిజన్ పరిధిలోని సీఐ,ఎస్ఐలు, పోలీసు బలగాలు వీధుల్లో నిరంతరం పహారా కాశాయి.

​ముఖ్యంగా పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా ముందస్తుగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఎక్కడా విద్యుత్ అంతరాయం కలగకుండా చూస్తూనే, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచారు. పోలీసుల నిరంతర గస్తీల మధ్య జాతర ముగింపు ఘట్టం సురక్షితంగా జరిగింది.

​మూడు రోజుల పాటు జాతర మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించిన గంగమ్మ గుడి చైర్మన్ సోలా మల్లికార్జున్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులను స్థానిక ప్రజలు అభినందించారు. అలాగే, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించి జాతరను ప్రశాంతంగా పూర్తి చేసిన పోలీసు యంత్రాంగానికి, ఇతర శాఖల సిబ్బందికి ఆలయ కమిటీ నిర్వాహకులు మరియు పట్టణ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *