రాజీవ్ నగర్ ఎస్టీ కాలనీ వాసులకు, శివం టు శివం రోడ్డు బాధితులకు స్థలాల కేటాయింపు.

​రేణిగుంట ఆగష్టు 15. శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయంలో ఆగస్టు 15న జరిగిన కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఇళ్ల పట్టాలు, భూ హక్కు పత్రాలు అందజేసినట్లు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చేతల్లో చేసి చూపించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీకాళహస్తి అభివృద్ధికి అత్యంత కీలకమైన ‘శివం టు శివం’ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 15 మందికి ఇచ్చిన హామీ ప్రకారం రెండు సెంట్ల చొప్పున నివేశన స్థలాలు కేటాయించామని చెప్పారు. అలాగే ఏళ్ల తరబడి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న రాజీవ్ నగర్‌లోని ఎస్టీ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు వివరించారు.

​గతంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించినప్పుడు భూములు ఆధీనంలో ఉన్నప్పటికీ, అధికారికంగా పట్టాలు మరియు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు రాక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నానని తెలిపారు. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ వారి భూములపై పూర్తి హక్కు కల్పిస్తూ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు, భూ పట్టాలను అందించినట్లు వెల్లడించారు. లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు తమ చేతికి ఇళ్ల పట్టాలు, హక్కు పత్రాలు అందుకునే సమయంలో వారి కళ్లలో చూసిన ఆనంద భాష్పాలు తన జీవితంలో ఎప్పటికీ మరువలేనని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తనకు నిజమైన సంతోషమని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *