రేణిగుంట, తిరుపతి జిల్లా: ప్రజల భద్రతే ధ్యేయంగా, నేర రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచనలతో శనివారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పోలీసులు భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్బన్ సీఐ జయచంద్ర, ఎస్సై శ్రీనివాసులు నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రయాణికులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, స్థానిక వ్యాపారులకు పలు కీలక అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ప్రసంగిస్తూ, మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వేధింపులు ఎదురైనా వెనుకాడకుండా వెంటనే 100 నంబర్‌కు గానీ, లేదా స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు వివరాలు, ఓటీపీ (ఓటీపీ ) నంబర్లను ఎవరికీ చెప్పకూడదని, ఒకవేళ మోసపోతే వెంటనే గోల్డెన్ అవర్ లోపు 1930 జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు అధైర్యపడకుండా కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తమ ఫోన్‌ను బ్లాక్ చేసుకోవచ్చని, దీనివల్ల దొంగిలించబడిన ఫోన్ మరెవ్వరూ వాడకుండా నిరుపయోగంగా మారుతుందని అవగాహన కల్పించారు. అనంతరం వాహన చోదకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో వాహనాలను నిలపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పోలీస్ సిబ్బంది, ఆర్టీసీ అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పాల్గొనగా, ప్రజల నుంచి వచ్చిన పలు సందేహాలను సీఐ జయచంద్ర, ఎస్సై శ్రీనివాసులు నివృత్తి చేసి, పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజల సేవలో అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.


