రేణిగుంట, జులై 10.

​తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పరిధిలో పోలీసులు జరిపిన ముమ్మర తనిఖీల్లో భారీగా కృత్రిమ మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డీఎస్పీ వై. శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఎస్. జయచంద్ర మరియు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) వై. శ్రీనివాసులుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

​సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డీఎస్పీ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మాదకద్రవ్యాల సరఫరాపై తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని స్పష్టం చేశారు. సాధారణంగా ‘మెత్’, ‘ఎక్స్‌టి’, ‘మాలి’, ‘మాండి’ వంటి రకరకాల పేర్లతో పిలిచే ప్రమాదకరమైన కృత్రిమ రసాయనిక మత్తుపదార్థం ఎండిఎంఏ ను రేణిగుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. నిందితుల నుండి 62 గ్రాముల మత్తుపదార్థం తో పాటు, 4 మాతృకలు (సెల్ ఫోన్లు), బరువు తూచడానికి ఉపయోగించే 2 డిజిటల్ త్రాసులు, మరియు 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

​ఈ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న గుణశేఖర్, అశ్విని కుమార్, రాహుల్ యాదవ్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వీరిలో ఒకరు స్థానిక కళాశాలలో సాంకేతిక విద్య (బి.టెక్) చదువుతుండగా, మిగిలిన వారు తిరుపతిలో నివసిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నిందితులు బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి నుంచి ఈ మత్తుపదార్థాలను కొనుగోలు చేసి, రేణిగుంట మండలం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న పొట్లాలుగా మార్చి యువతకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

​ఈ మత్తుపదార్థాల శృంఖలాన్ని పూర్తిగాచేధించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని, బెంగళూరు లింకులపై నిఘా పెట్టామని చెప్పారు. జిల్లా రక్షక పర్యవేక్షకులు (ఎస్పీ) ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లాను గంజాయి మరియు మత్తుపదార్థాల రహితంగా మార్చేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ‘బయో చెక్’ పరికరాల ద్వారా అనుమానితులకు తక్షణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (డీఎస్పీ) తెలిపారు.

​మత్తుకు బానిసలైన యువతను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని, అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రులలోని విముక్తి కేంద్రాలకు పంపిస్తామని పేర్కొన్నారు. రేణిగుంట మండలంలో సమర్థవంతంగా దాడులు నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ), సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) మరియు సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *