టీటీడీ కో-ఆపరేటివ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం బహిష్కరణ..
పంతాలకు పోయి ఒకే రోజు రెండు కార్యక్రమాలు నిర్వహించడం అన్యాయం…
సంతకాల విషయంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు..
తిరుపతిజూన్ 29.
తమకు పదవులు ముఖ్యం కాదని, టీటీడీ ఉద్యోగుల శ్రేయస్సు, వారి హక్కులు, గౌరవమే అత్యంత ప్రధానమని తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్టర్ చీర్ల కిరణ్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు శ్రీవారి సేవలో తరించి, పదవీ విరమణ పొందుతున్న సుమారు 130 మంది సహోద్యోగుల సన్మాన కార్యక్రమానికే తాను హాజరవుతున్నట్లు ప్రకటించారు. అదే రోజున మొండివైఖరితో నిర్వహిస్తున్న టీటీడీ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జనరల్ బాడీ సమావేశాన్ని ఒక ప్రస్తుత డైరెక్టర్ గా, మాజీ అధ్యక్షుడిగా, మాజీ ఉపాధ్యక్షుడిగా, మాజీ కోశాధికారిగా తాను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఉద్యోగుల గౌరవం ముఖ్యం.. జనరల్ బాడీ తర్వాతే!
పదవీ విరమణ పొందుతున్న 130 మంది ఉద్యోగులను సత్కరించేందుకు, అధికారుల ప్రసంగాలతో కలిపి సాయంత్రం 7:30 గంటల వరకు సమయం పడుతుందని చీర్ల కిరణ్ పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రోజునే జనరల్ బాడీ సమావేశాన్ని కూడా నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఒక రోజు ముందుగానో లేదా మరుసటి రోజునో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉంటే అందరూ ప్రశాంతంగా పాల్గొనే అవకాశం ఉండేదన్నారు. ఈ విషయమై ఉద్యోగులు, సొసైటీ సిబ్బంది పాలకవర్గానికి ముందే విన్నవించినప్పటికీ, కొందరు సభ్యులు పంతానికి పోయి ఒకే రోజు రెండు కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా నిర్వహించడం అన్యాయమని మండిపడ్డారు.
సంతకాలపై అప్రమత్తత అవసరం
పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యే ఉద్యోగులు సంతకాల విషయంలో తీవ్ర అప్రమత్తంగా ఉండాలని చీర్ల కిరణ్ విజ్ఞప్తి చేశారు. అక్కడ ఏదైనా రిజిస్టర్ లేదా పత్రాలపై సంతకాలు చేయమని కోరితే, అవి ఏ ప్రయోజనం కోసం సేకరిస్తున్నారో నిలదీయాలని కోరారు. తొందరపడి సంతకాలు పెడితే, ఉద్యోగులంతా జనరల్ బాడీ మీటింగ్కు హాజరై అజెండాలను ఆమోదించినట్లు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి సభ్యునికి తన సంతకం దేనికి వాడుతున్నారో తెలుసుకునే హక్కు ఉందని, సందేహాలు ఉంటే స్పష్టత వచ్చేవరకూ సంతకాలు పెట్టవద్దని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, రేపు పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగ సోదర సోదరీమణులకు చీర్ల కిరణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

