తిరుపతి, జూన్ 28: వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాల ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐకమత్యం మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా కార్పొరేట్ క్రికెట్ టి – 20 లీగ్ – 2026 (9వ ఎడిషన్) ఆదివారం ఎస్.వి. యూనివర్సిటీ స్టేడియం, తిరుపతిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు , తుడా చైర్మన్ & టీటీడీ బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి , ఎస్.వి. యూనివర్సిటీ డైరెక్టర్ అప్పారావు , రిజిస్ట్రార్ భూపతి నాయుడు , తిరుపతి జనసేన అధ్యక్షులు రాజా రెడ్డి , ఎస్.వి. యూనివర్సిటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు శ్రీధర్ , జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం , టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ చీర్ల కిరణ్ , ఆర్గనైజర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు మరియు పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు.
అతిథులను టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ చీర్ల కిరణ్ ఘనంగా సత్కరించారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మరియు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి బ్యాటింగ్ చేసి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు.
టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ తిరుపతి జిల్లా కలెక్టర్ జట్టు మరియు తిరుపతి జిల్లా అడ్మిన్ సెక్రటరీస్ జట్టు మధ్య జరిగింది.
ఈ సందర్భంగా చీఫ్ ఆర్గనైజర్ చీర్ల కిరణ్ మాట్లాడుతూ, గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ఈ ఏడాది మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 15 రోజుల పాటు కొనసాగే ఈ టోర్నమెంట్‌లో 16 వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు విశ్వవిద్యాలయాల జట్లు పాల్గొంటున్నాయని, ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఆరోగ్యకరమైన పోటీ, జట్టు సమన్వయం మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యమని వివరించారు.
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు విధులతో పాటు క్రీడల్లో కూడా రాణించడం అభినందనీయమని, ఇలాంటి టోర్నమెంట్‌లు ఉద్యోగుల్లో ఆరోగ్యం, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలు మరియు పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తూ, అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తుడా చైర్మన్ & టీటీడీ బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి స్నేహపూర్వక వాతావరణంలో పోటీపడే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ టోర్నమెంట్ ప్రశంసనీయమని అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వం మరియు జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొంటూ, ఈ టోర్నమెంట్ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కార్పొరేట్ క్రికెట్ ఈవెంట్‌గా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు మరియు క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *