​తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యద్దలవారిపల్లి గ్రామంలో జరిగిన రెండు దొంగతనం కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితులు యన్నారు అనంతమ్మ, యద్దల మౌనికల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో వై.కోట – ఎద్దులవారిపల్లి మూడు రోడ్ల కూడలి వద్ద నిందితులైన కొండేటి జ్యోతి ప్రకాష్ (19), ఉమ్మక శివ మనోజ్ (19), నందలూరు కౌశిక్ కుమార్ రెడ్డి (20)లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి సుమారు రూ.18.70 లక్షల విలువైన 170 గ్రాముల (17 తులాల) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎద్దుల అఖిల్ వర్ధన్ అనే మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసును వేగంగా ఛేదించిన రైల్వే కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, ఓబులవారిపల్లి ఎస్‌ఐ కె. సుజన్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని లేదా ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాలు, కాలనీలలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే అత్యవసర నంబర్ 112, మహిళల భద్రత కోసం 181, సైబర్ నేరాల కోసం 1930 నంబర్లకు సమాచారం అందించాలని, ఆస్తుల భద్రతకు భంగం కలిగించే నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *