శ్రీకాళహస్తి:
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘మహానాడు–2026’ పండుగకు శ్రీకాళహస్తి నియోజకవర్గం సర్వసిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా పసుపు పండుగ వాతావరణం సంతరించుకోగా, పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. మహానాడు కార్యక్రమాలను పురస్కరించుకుని ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
మహానాడు వేడుకల్లో పాల్గొనే ముందు.. శ్రీకాళహస్తి పట్టణంలోని యుగపురుషుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్.టి.రామారావు విగ్రహానికి ఎమ్యెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి చేరుకుని, అక్కడ ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు చేసి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ పసుపు జెండాను బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించి, మహానాడు ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. జెండా ఆవిష్కరణ అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి డిజిటల్ వేదికల వైపు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ అయిన మహానాడును నియోజకవర్గంలో పండుగలా నిర్వహిస్తున్నామని తెలిపారు. మన నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరూ ఈ పసుపు పండుగలో అత్యంత ఉత్సాహంగా పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ మహానాడు–2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్యెల్యే పిలుపుతో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహానాడు డిజిటల్ వేదికల వద్ద సందడి చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో ఈ వేడుకలు సరికొత్త జోష్‌ను నింపాయి


