తిరుపతి, మే 23:
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో మెగా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, గంజాయి విక్రేతలు, సేవించే వారు మరియు 14 ఏళ్ల లోపు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి పోక్సో కేసుల్లో నిందితులుగా ఉన్న మొత్తం 485 మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ నిందితులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ, నేర ప్రవృత్తిని వీడకపోతే వారిపై కఠినమైన పి.డి యాక్ట్ నమోదు చేయడంతో పాటు, అవసరమైతే రాష్ట్రం నుండి బహిష్కరణ చర్యలు కూడా చేపడతామని స్పష్టం చేశారు. ఈ మెగా కౌన్సిలింగ్‌లో రేణిగుంట సబ్ డివిజన్ నుండి మొత్తం 109 మంది హాజరుకాగా, రేణిగుంట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వై. శ్రీనివాసరావు, రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. జయచంద్ర మరియు సబ్ డివిజన్ పరిధిలోని ఇతర పోలీస్ అధికారులు పాల్గొని నిందితులకు అవగాహన కల్పించారు. సమాజ శాంతికి విఘాతం కలిగించే వారి పట్ల పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి జీవించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.


