తితిదే ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీర్ల కిరణ్….

తిరుపతి ఉత్తేజిత మే 5.
తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన సిపిఎస్ ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తితిదే ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీర్ల కిరణ్ తెలిపారు. ఈ మేరకు తితిదే కార్యనిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్రకు వినతిపత్రం సమర్పించారు.
​మనిషి జీవితంలో ఆరోగ్యం అత్యంత కీలకమని, ముఖ్యంగా వయస్సు పెరిగిన తర్వాత వైద్య అవసరాలు మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అటువంటి సమయంలో రిటైర్డ్ ఉద్యోగులకు అందుబాటులో ఉండే వైద్య సదుపాయాలు కల్పించడం ప్రాథమిక బాధ్యత అని వివరించారు. ప్రస్తుతం పింఛను పొందుతున్న ఉద్యోగుల నుంచి నెలకు రూ.800 వసూలు చేస్తూ వారికి ఆరోగ్య నిధి ద్వారా వైద్యం అందిస్తున్నారని, అయితే పింఛను లేదనే కారణంతో సిపిఎస్ ఉద్యోగులను ఈ పథకం నుంచి మినహాయించడం సరికాదని అన్నారు.
​దీని పరిష్కారానికి రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసి, వారి నుంచి కూడా తగిన మొత్తాన్ని సేకరించి ఆరోగ్య నిధి పథకంలో భాగస్వాములను చేయాలని కోరారు. పింఛను ఉద్యోగులతో సమానంగా సిపిఎస్ ఉద్యోగులకు కూడా అన్ని వైద్య సౌకర్యాలు వర్తింపజేయాలని, దీనిపై కార్యనిర్వహణ అధికారి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చీర్ల కిరణ్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *