భవన నిర్మాణ కార్మికులకు రూ. 5 లక్షల బీమా భరోసా…
రేణిగుంటలో కార్మిక గర్జన….
భారీ ర్యాలీ మరియు వేయ్యి మందికి అన్నదానం….
రేణిగుంట, మే 01:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేణిగుంట మండలంలో మే డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. రేణిగుంట మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో బ్యాండ్ మేళాలు, వాయిద్యాల హోరు, బాణసంచాలచప్పుళ్ళు మధ్య భారీ ర్యాలీ నిర్వహించి, ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికులంతా ఐక్యమత్యంగా నినదిస్తూ, శ్రమజీవుల గొప్పతనాన్ని చాటిచెప్పారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భవన నిర్మాణ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రసూల్ మాట్లాడుతూ.. గత 14 ఏళ్లుగా రేణిగుంటలో ఈ సంఘం కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందక ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కార్మికుల అభివృద్ధికి తమ సంఘం శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నేడు 210 మంది కార్మికులకు నూతన ఐడి కార్డులను, వారికి వర్తించే ఇన్సూరెన్స్ లకు అప్లికేషన్లు నింపడం గర్వకారణంగా ఉందన్నారు.
కార్మికుల భద్రతపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. సంఘం ఏర్పడిన నాటి నుండి ప్రమాదాల బారిన పడి మరణించిన 70 మంది కార్మికుల కుటుంబాలకు యూనియన్ తరపున రూ. 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశామని గుర్తుచేశారు. అవగాహన లోపంతో గతంలో చాలామంది బీమా సౌకర్యం పొందలేకపోయారని, అయితే ఇకపై ప్రతి కార్మికుడికి ప్రభుత్వం ద్వారా అందే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అందేలా తమ సంఘం బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్మికుల హక్కుల కోసం, వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం రేణిగుంట బస్టాండ్ వద్ద సుమారు 1,000 మంది కార్మికులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా యూనియన్ కీలక పాత్ర పోషిస్తుందని, కార్మికులకు అన్యాయం జరిగితే అంతా ఏకమై పోరాడతామని నిర్వాహకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ వేడుకల్లో సంఘం సలహాదారులు తులసి రాజన్, ఉపాధ్యక్షులు సి. నాగరాజు, సెక్రటరీ షణ్ముగం, ట్రెజరర్ డి.పి. నాయుడు, సభ్యులు చిన్న, శ్రీను, రమణతో పాటు అధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
