మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్‌ మండలంలోని పెద్ద ఎక్లారాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్‌ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌లోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి,విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్,స్వయంగా గుడ్లను తూకం వేసి వాటి బరువును పరిశీలించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్ల బరువు ఉందో లేదో తనిఖీ చేస్తూ, తక్కువ బరువుతో సరఫరా అవుతున్నాయా అన్న అంశాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా తక్కువ బరువుతో గుడ్లు సరఫరా అయితే సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరఫరాలో నాణ్యత లోపాలు ఉంటే గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం,వసతులపై ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్, విద్యార్థులకు పోషకాహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్కూల్‌ లో శుభ్రత, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. ఆయన వెంట డీఈవో రాజు, టి సి ఓ రామ్మోహన్, మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *