నేతాజీ ఆశయాలు యువతకు స్ఫూర్తి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..!
వింజమూరు, జనవరి 25,మన ధ్యాస న్యూస్.(నాగరాజు కె).
వింజమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో భారత స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర సాధనలో అసమానమైన త్యాగం, అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో గర్వకారణంగా, అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, దేశ స్వాతంత్ర సంగ్రామానికి కొత్త దిశానిర్దేశం చేసిన మహనీయుడు నేతాజీ అని కొనియాడారు.సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల ఎన్నో ఏళ్ల నిరంతర పోరాటం, అపారమైన త్యాగాలు, అచంచలమైన సంకల్పబలమే నేటి తరానికి స్వేచ్ఛా స్వతంత్రాలను అందించిందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అలాంటి మహానీయుల సేవలను స్మరించుకోవడం, వారి ఆశయాలను భావితరాలకు తెలియజేయడం ఎంతో అవసరమని అన్నారు.ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, యువతలో దేశభక్తి భావాలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్న నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవితం, ఆదర్శాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
