శంఖవరం/కాకినాడ మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): సామాన్య మద్య తరగతి ప్రజానీకానికి రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రతను కల్పించడమే అటల్ పెన్షన్ యోజన పథకం ప్రధాన ఉద్దేశమని ఎస్.ఎల్.బి.సి. ఎ.జి.ఎం. శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల జయ స్పందన ఫంక్షన్ హాల్‌లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అటల్ పెన్షన్ యోజనపై అవగాహన కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఎల్.డి.ఎం. సి.హెచ్.ఎస్.వి. ప్రసాద్ అధ్యక్షత వహించగా, పి.ఎఫ్.ఆర్.డి.ఎ. సి.జి.ఎం. పరవేష్ కుమార్ ముఖ్య అతిధిగా, ఎస్.ఎల్.బి.సి. ఎ.జి.ఎం. శ్రీనివాస్ విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. డి.ఐ.సి. జి.ఎం. గణపతి, డి.ఆర్.డి.ఒ. పి.డి. శ్రీనివాసరావు, మెప్మా పి.డి. ప్రియంవధ, నాబార్డ్ ఎ.జి.ఎం. సోమినాయుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్.ఎం. బి.జి.ఆర్. నాయుడు, ఎస్.బి.ఐ. ఆర్.ఎం. కృష్ణ, ఎ.పి.జి.బి. ఆర్.ఎం. శ్రీనివాసరావు గౌరవ అతిధులుగా పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎస్.ఎల్.బి.సి. ఎ.జి.ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజలు తమ రిటైర్మెంట్ తరువాత భద్రత కోసం తప్పనిసరిగా అటల్ పెన్షన్ యోజనలో చేరాలని సూచించారు. చిన్న మొత్తాలుగా సేవింగ్స్ చేయడం ద్వారా వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ పొందే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందని తెలిపారు.పి.ఎఫ్.ఆర్.డి.ఎ. సి.జి.ఎం. పరవేష్ కుమార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో సామాన్య ప్రజల పొదుపులు కీలకమని, ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు భద్రత కోసం ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకులు మరియు బిజినెస్ కారస్పాండెంట్లు గ్రామీణ ప్రజల్లో చైతన్యం కల్పించి ఈ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని ఆయన కోరారు.మెప్మా పి.డి. ప్రియంవధ మాట్లాడుతూ మహిళలు, స్వయంసహాయక సంఘాల ద్వారా అటల్ పెన్షన్ యోజన ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడం ద్వారా గ్రామీణ మహిళల్లో భవిష్యత్ భద్రతపై అవగాహన పెంపొందించవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు తమ కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించగలరని అన్నారు. ఎల్.డి.ఎం. సి.హెచ్.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లా వ్యాప్తంగా పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచే లక్ష్యంతో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అటల్ పెన్షన్ యోజనలో చేరిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించగలరని అన్నారు.కార్యక్రమం ముగిసిన అనంతరం అతిథులను సాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, బిజినెస్ కారస్పాండెంట్లు, నాబార్డ్, మెప్మా, డి.ఆర్.డి.ఒ., డి.ఐ.సి. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రజలు అటల్ పెన్షన్ యోజనపై అవగాహన పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ భద్రతపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు.







