జి.డి. నెల్లూరు, మన ద్యాస :- జి.డి. నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్‌ను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చారిత్రాత్మక కో వారంటో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి, డబ్ల్యూ.పి. నెంబర్ 26148/2025 కేటాయించింది. కేసులో సురేష్ కుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తారు. తప్పుడు హోదా – మోసపూరిత విజయం ఆరోపణ 2024 ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ థామస్ వడింగాడు మునస్వామి థామస్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ, తాను హిందూ షెడ్యూల్డ్ కులానికి చెందినవాడినని తప్పుడు హోదా చూపించి గెలిచారని సతీష్ రెడ్డి ఆరోపించారు. తమిళనాడు గెజిట్‌లో ఆయన క్రైస్తవ మతం స్వీకరించినట్లు ప్రకటించారని, దీన్ని ఆధారంగా చేసుకొని తాను నామినేషన్ సమయంలో ఎన్నికల సంఘం, కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదన్నారు. అంతేకాకుండా జాతీయ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశానని వివరించారు.
తిరుమలలో డిక్లరేషన్ :- 2024 జూన్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు థామస్ తిరుమల దర్శనం చేసుకునే సమయంలో తాను అన్యమతస్థుడునని డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాన్ని సతీష్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. రాజ్యాంగ ఉల్లంఘన “భారత రాజ్యాంగం ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు తప్ప ఇతర మతాన్ని ఆచరించే వారికి ఎస్సీ హోదా లభించదు. థామస్ చర్య రాజ్యాంగాన్ని, ఎస్సీ హిందూ సమాజాన్ని మోసం చేయడమే” అని రిట్లో పేర్కొన్నారు. ఆర్టికల్స్ 330, 332, 335, 338, 338A, 339, 341, 342తో పాటు 1950 అధ్యక్ష ఉత్తర్వు స్పష్టంగా ఈ విషయాన్ని చెబుతున్నాయని గుర్తుచేశారు. “రెండు ప్రయోజనాలు పొందలేరు” “మతమార్పిడి చేసుకున్న వారు రెండు ప్రయోజనాలు పొందలేరు. ఒకవైపు మైనారిటీ హక్కులు, మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగానికి విరుద్ధం. ఇది పేద ఎస్సీ హిందువుల హక్కులను దోచుకోవడమే. నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ఎస్సీ హిందూ సమాజానికి న్యాయం జరగాలని ఈ పోరాటం చేస్తున్నాను” అని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక తీర్పు అవుతుందనే నమ్మకం :- ఈ పిటిషన్‌ను కో వారంటో రిట్‌గా స్వీకరించి, థామస్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హునిగా ప్రకటించి, తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసు భవిష్యత్తులో ఒక చారిత్రాత్మక తీర్పుగా నిలిచి, ఎస్సీ హక్కులను రక్షించే దిశగా మార్గదర్శకంగా నిలుస్తుందని, మతం మారిన వారు రిజర్వేషన్లను దుర్వినియోగం చేయకుండా నిరోధిస్తుందని మిట్టపల్లి సతీష్ రెడ్డి (సామాజిక కార్యకర్త) ఆశాభావం వ్యక్తం చేశారు.

మిట్టపల్లి సతీష్ రెడ్డి (సామాజిక కార్యకర్త)