

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: ఏప్రిల్ 22న బైసరాన్, పహల్గాంలో నిరాయుధ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని సిపిఐ(యమ్- యల్) లిబరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నదని, ఈ దాడిలో మరణించిన మరియు గాయపడిన బాధితులకు పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నదని,బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ, ఉగ్రదాడిని ఖండిస్తూ బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల సర్కిల్లో కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య మరియు జిల్లా నిర్మాణ కమిటీ సభ్యులు సంగటి చంద్రశేఖర్ లు మాట్లాడుతూ, మొన్నటి దినం జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపడం చాలామందిని గాయపరచడం దారుణమని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని పద్ధతి వైఫల్యాలను సరిదిద్దుకొని తక్షణమే రక్షణ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.జమ్మూ-కాశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగా మారాయని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం, జాతీయ భద్రత గురించి వారి గొప్పలు ఈ దాడితో పటాపంచలయ్యాయని ఈ ప్రాంతంలో నివాసితులైన వలస కార్మికులపైన, ఇప్పుడు పర్యాటకులపైనా దాడులు పెరిగిపోతుండడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో పూర్తిగా శాంతి నెలకొందని బీజేపీ పలుమార్లు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో వరుసగా జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనలు వారి ప్రకటనలు బూటకత్వాన్ని బట్టబయలు చేస్తున్నాయని,ఆ ప్రాంతం ఇప్పటికీ బలగాలతో నిండి ఉందని అయినా మోడీ పాలనలో ఉగ్ర దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం పీక నులుముతూ తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించే ప్రభుత్వ వ్యూహం శాంతి భద్రతలను కాపాడ లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషాదకర ఘటనను జాతి ఉన్మాదాన్ని, మతవిద్వేషాన్ని రెచ్చగొట్టడానికి వాడుకోవాలనే ప్రయత్నాలను ఖచ్చితంగా ఖండించాలని,ఇటువంటి సంక్లిష్ట సమయంలో, దేశవ్యాప్తంగా ప్రజలు ఐక్యంగా వుంటూ, ఈ ఘటనలను రాజకీయంగా లాభపడేందుకు ఉపయోగించుకునేవిభజన శక్తుల కుట్రను ఎదిరించాలని, అలాగే మోడీ ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ సభ్యత్వం రద్దు చేసి, ద్వైపాక్షిక సంబంధాలను వాణిజ్య ఒప్పందాలను నిలుపుదల చేసే విధంగా తీర్మానం చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చంద్రమోహన్ రాజు, జకరయ్య విద్యార్థి సంఘం జిల్లా నాయకులు బండి అనిల్, నియోజకవర్గం పార్టీ నాయకులు రామరాజు, కే బాబు, విజయరావు, నారాయణ, జయరామరాజు,చిన్న, చంద్రపాల్, పాండు, సుబ్రమణ్యం, చెన్నయ్య, గుర్రప్ప, శివశంకర్, శాంసన్ తదితరులు పాల్గొన్నారు.