

మాకొద్దు. మాకొద్దు.. వర్గీకరణ మాకొద్దు..
మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:మాలలను,మాదిగలను విభజించి పరిపాలించాలని కుట్ర పన్నుతూ రిజర్వేషన్ ఫలాలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణకు నాంది పలికారని దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రత్తిపాడు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు,స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు గునపర్తి అపురూప్ మండిపడ్డారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,మండల కేంద్రమైన శంఖవరం స్థానిక జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో వర్గీకరణ అంతం..మాలల పంతం..మాకొద్దు.. మాకొద్దు..వర్గీకరణ మాకొద్దు.. నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా శంఖవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మండల తహసిల్దార్ కి వర్గీకరణ రద్దు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు.అనంతరం గునపర్తి అపురూప్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణను ఆమోదిస్తూ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో మాలలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు.మాల మాదిగలు ఒక తల్లి కడుపున పుట్టి అన్నదమ్ముల వలె ఉన్న వారి మధ్య చిచ్చులు పెట్టి విడగొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు.వర్గీకరణ జరిగినంత మాత్రాన మాదిగలు రాజ్యాంగ ఫలాలు పొందలేరని, మాదిగలకు వాసన చూపించి అగ్రకులస్తులే దోచేస్తారని అన్నారు. వర్గీకరణ ఆమోదిస్తూ మాలలకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో మనుగడ సాధించలేదని,రానున్న ఎన్నికల్లో మాలలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు.అన్యాయానికి గురైన దళితులు న్యాయం కొరకు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని ఈ సందర్భంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ,ప్రత్తిపాడు నియోజకవర్గ బిఎస్పి ఉపాధ్యక్షులు జై భీమ్ యూత్ సభ్యులు కొంగు రమేష్,కాకినాడ జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు జై భీమ్ యూత్ సభ్యులు గునపర్తి కొండలరావు,దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు ప్రత్తిపాడు బీఎస్పీ ప్రధాన కార్యదర్శి బత్తిన తాతాజీ,దళిత ఉద్యమ నాయకులు శికోలు నాగు,పొలుమాటి శాంతి భరత్,బత్తిన శివరాం, గునపర్తి రాఘవ,కానేటి సాల్మన్ రాజు,రాయి అనిల్, బోడపాటి చక్రవర్తి,చెవల మధు,భారీ సంఖ్యలో స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.