​గ్రంథాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురవారెడ్డి

​రేణిగుంట, నవంబర్ 16:
రేణిగుంట శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురవారెడ్డి సోమవారం సందర్శించారు. వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజున విద్యార్థులు, కవులు, కళాకారులు మరియు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో కలిసి గ్రంథాలయ పితామహులు ఎస్.ఆర్. రంగనాథన్, వెంకట్రామయ్య, పాతూరు నాగభూషణం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​అనంతరం డాక్టర్ రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ, 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలల దినోత్సవం, రెండవ రోజు పుస్తక ప్రదర్శన నిర్వహించామని, మూడవ రోజు గ్రంథాలయ ఉద్యమ పితామహులను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. గ్రంథాలయాలు ప్రజల్లో చైతన్యం నింపి మంచి సమాజ నిర్మాణానికి దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం వైపు మక్కువ చూపి, సరస్వతీ నిలయాలైన గ్రంథాలయాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు.
​కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో గ్రంథాలయాలను ఆధునిక సౌకర్యాలతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. కవులు, కళాకారుల ద్వారా మన ప్రాచీన జానపద గేయాలు, పద్యాలు, సంప్రదాయాలను నేటి తరం విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఈ వారోత్సవాల ద్వారా కలుగుతుందన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి, ఈ నెల 20వ తేదీన విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
​ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురవారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి నాగరాణి, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నడ్డి నారాయణ, ముని లక్ష్మి, రమణ మరియు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *